Hyderabad, Jan 6: బోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియను (Bowenpally Police Arrest Bhuma Akhila Priya) బుధవారం బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు (Bowenpally kidnap case) సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు.
కాగా మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులైన (KCR Relative Kidnap Case) మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును అక్కడ ప్రస్తావించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు
ఎట్టకేలకు బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. కిడ్నాపర్లు నార్సింగ్ వద్ద బాధితులను వదిలేసి పరారవ్వగా సీసీ ఫుటేజీల ఆధారంగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు వాహనాలను పట్టుకున్నారు. కీలక నిందితుడు చంద్రబోస్‌తోపాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కిడ్నాప్‌కు హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వ్యవహారమే కారణమని పోలీసులు గుర్తించారు. భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెక్కీ నిర్వహించి మరి కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల పై ఐపీసీ సెక్షన్ 448, 419, 341, 342, 506, 366 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసుకు హఫీజ్‌పేటలోని 50 ఏకరాల భూవివాదమే కారణమని బాధితుల బంధువు ప్రతాప్ తెలిపారు. ఆ భూమికి సంబంధించి చాలా మంది పార్ట్‌నర్స్ ఉన్నారని, ఆ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్‌లు అన్నీ ఉన్నాయని తెలిపారు. భూమా కుటుంబం, వాళ్ల పార్ట్‌నర్స్ మధ్య విభేదాలు కిడ్నాప్‌నకు దారి తీశాయని చెప్పారు. భూమా వర్గం వారి పార్ట్‌నర్స్‌తో తేల్చుకోవాలని చాలాసార్లు చెప్పామన్నారు.
భూ వివాదంలో వాళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రెండేళ్ల క్రితమే తమని సంప్రదించారని, అప్పుడే అన్ని డాక్యుమెంట్లు చూపించామన్నారు. అయినప్పటికి భూమా కుటుంబం మళ్లీ తమ మీదకే వివాదానికి వచ్చిందని తెలిపారు. తాము పోలీసులకు చెప్పిన అనుమానితుల్నే కిడ్నాపర్లుగా తేల్చారన్నారు.