Padi Kaushik Reddy Vs MLA Sanjay(X)

Hyd, Jan 13: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్‌లో తన ప్రసంగాన్ని అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు.

కరీంనగర్ జిల్లా సమావేశం రసాభాస, సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం, ఒరేయ్ అంటూ ఎమ్మెల్యేను సంబోంధించిన కౌశిక్.. వీడియో

దీంతో డాక్టర్‌ సంజయ్‌ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్‌ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. ఒక దశలో సంజయ్‌ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఈ ఘటనపై కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎమ్మెల్యే సంజయ్‌ ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్‌రెడ్డిపై ఇంకో కేసును ఫైల్‌ చేశారు. ఈమేరకు వేర్వేరుగా మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు.