Hyderabad, March 15: కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు (BRS Cadre Protest) చేపట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కవిత అరెస్టు (Kavitha Arrest) రాజకీయంగా ప్రేరేపితమైనదే అని విమర్శించారు. ఏడాదిన్నర కింద కవితకు విట్‌నెస్ కింద ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని.. ఇవాళ వచ్చి నిందితురాలు కింద అరెస్టు చేస్తున్నామని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాదిన్నరకాలంగా ఏం చేశారని ఈడీ అధికారులను ప్రశ్నించారు. రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా.. ఇవాళ అరెస్టు చేయడమంటే.. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిందేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని విమర్శించారు. దీన్ని తప్పకుండా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు.
అప్రజాస్వామికంగా జరిగిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/foTLqpfSDS
— BRS Party (@BRSparty) March 15, 2024
కవితను అరెస్టు చేయాలని ఈడీ అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చారని హరీశ్‌రావు అన్నారు. అందుకే ముందుగానే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని వచ్చారని తెలిపారు. ఉదయం ఏమో సెర్చ్ అన్నారు.. సాయంత్రం ఏమో అరెస్టు అంటారు.. ఇదంతా ప్లాన్ చేసుకున్నదే అని ఆయన స్పష్టం చేశారు. ‘మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి కోర్టు సమయం అయిపోయిన తర్వాత 6 గంటలకు అరెస్టు అని అంటారు.. అందులో రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం.. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేసిందే.’ అని హరీశ్‌రావు అన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండటంతో తమ పార్టీ కేడర్‌ను, నాయకుడిని డీమోరలైజ్ చేసే ఉద్దేశంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
కవిత అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయి.
- మాజీ మంత్రి ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/gcPZB9n471
— BRS Party (@BRSparty) March 15, 2024
ఎవరెన్ని చేసినా పోరాటాలు తమకు కొత్త కాదని ఆయన తెలిపారు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు తమకు కొత్త కావని స్పష్టం చేశారు. తమ పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో అని తెలిపారు. తప్పకుండా ఉద్యమిస్తాం.. ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం.. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తామని తెలిపారు. అలాగే న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతామని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ శ్రేణులు.. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.