Hyderabad, March 16: బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) రాజీనామా చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై (BSP-BRS Alliance) ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నిక్లలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని ఆ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇతర ఏ పార్టీతోనూ కూడా పొత్తు ఉండదన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మందా ప్రభాకర్ (Manda Prabhakar) స్పష్టంచేశారు. తాము బీఆర్ఎస్‌తో గౌరవ ప్రదమైన స్థానాలు అశించామని, కానీ అవి కాకుండా బీఎస్పీకి బలం లేని స్థానాలను రెండింటినీ కేటాయించారని చెప్పారు. అందుకే పొత్తుని నిరాకరిస్తున్నామని మందా ప్రభాకర్ పేర్కొన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగించిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా రాజీనామా చేయడంపై కూడా పార్టీ కోఆర్డినేటర్ ప్రస్తావించారు. ఆయన ఎందుకు రాజీనామ చేశారో తెలియదన్నారు. ఆయన ట్వీట్ లో పేర్కొన్నది ఆయన వ్యక్తిగతమన్నారు. ప్రవీణ్ కుమార్ ఎందుకు పార్టీ వీడారో తెలియదని మందా ప్రభాకర్ తెలిపారు.