Hyderabad, JAN 21: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Budget session ) వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శనివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో (Harish Rao) పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ఉండటంతో బడ్జెట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ముఖ్యంగా పేదలు, రైతులు, యువతపై వరాల జల్లు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు దళితబంధు నిధులను పెంచడం వంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఇక పేద, మధ్యతరగతి ప్రజల చిరకాలకోరిక అయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఆర్ధిక సాయం వంటివాటిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంంది. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.