Vijayawada, SEP 10: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కుంభంకోణం (Skill Development Scheme Scam) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Remand) విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్‌ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకుని రాత్రి సిట్ (SIT) కార్యాలయంలో విచారించింది. ఆదివారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఆ తర్వాత ఏసీబీ కోర్టులో (ACB Court) దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం, చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందం వాదనలు వినిపించాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టులో వాదనల తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అయితే, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు, చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.