Hyderabad, March 23: ప్రధాని మోదీకి (Modi) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) లేఖ (Letter) రాశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ (Procurement Policy) లేదని చెప్పారు. పంజాబ్ (Punjab), హర్యానాలో (Haryana) వందశాతం ధాన్యాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో (Telangana) ధాన్యం సేకరణ జరగడం లేదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అని సీఎం స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాల సేకరణ, వాటి భద్రత కూడా కేంద్రానిదే అని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
In a letter addressed to Prime Minister Sri @NarendraModi ji, CM Sri KCR has stated that India should have a uniform national food grains procurement policy with suitable statutory backing for implementation. pic.twitter.com/UPrHvRfnwI
— Telangana CMO (@TelanganaCMO) March 23, 2022
రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని (Paddy) సేకరించకపోతే, కనీస మద్దతు ధరకు ఏం అర్థముంటుందని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఆహార భద్రతా లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అవుతుందని సీఎం తేల్చి చెప్పారు. దేశ మంతా ఒకే రకమైన ధాన్య సేకరణ విధానం ఉండాలని, కేంద్ర ప్రభుత్వం పండిన ధాన్యాన్ని గనక పూర్తిగా సేకరించకపోతే సాగు రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన చర్యల వల్ల రాష్ట్రంలో ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, వ్యవసాయం సుస్థిరపడిందన్నారు సీఎం కేసీఆర్. పంటల వైవిధ్యత కోసమే తమ ప్రభుత్వం ఇతర పంటలను కూడా ప్రోత్సహిస్తోందని కేసీఆర్ కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయించామని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వరిని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 2 వరకు వేచి చూడాలని.. సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కోరారు. గురువారం వారు మంత్రిని కలువాలనుకున్నారు. యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు.