Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, March 12:  యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని ఈ మే నెలలో పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో, ఆలయ పనులు ఎంతవరకు వచ్చేయనే దానిపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుదికి చేరుకున్నాయి కాబట్టి చివరగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం (ఆర్నమెంటల్ లుక్ ) కోసం కార్యాచరణ గురించి ఆలయ అధికారులతో సీఎం చర్చించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు.

క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు. వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ , అందులో ఒక దానిని ఖరారు చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సీఎం గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు.

శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని అన్నారు.

రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవు ఉన్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం తిలకించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది. పున: ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి" అని సీఎం దిశానిర్ధేషం చేశారు.