Yadadri Temple | File Photo

Yadadri, June 22: యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని అన్ని రకాల పనులను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ పర్యటన అనంతరం సాయంత్రం యాదాద్రిని సందర్శించారు. తొలుత ఆలయ రింగ్ రోడ్ చుట్టూ పర్యటించి పలు నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని పూజారులు, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆలయ క్యూలైన్ ను, పసిడి విద్యుత్ కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేసిన ఆలయ లైటింగ్ ను పరిశీలించారు. ఆలయం బయట, లోపల నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రింగ్ రోడ్ పరిధిలో ఉన్న భూములపై డీజీపీఎస్ సర్వే అత్యవసరంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. రింగ్ రోడ్ పరిధిలోపల కేవలం ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని సీఎం పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం పనికిరాదని ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న ఇతర నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, లాండ్ స్కేపింగ్, బీటీ రోడ్, పుష్కరిణి, కల్యాణ కట్ట, కార్ పార్కింగ్ ఇతర నిర్మాణాల పనులు జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు. ఈ పనులన్నీ ఎప్పటి వరకు పూర్తవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్ ఏజెన్సీలను మార్చాలని సూచించారు. ఆలయ లైటింగ్ కోసం అధునాతన విద్యుద్దీపాలు అమర్చాలని సీఎం కోరారు. టెంపుల్ టౌన్ లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, వాటిని అద్భుతంగా నిర్మించే వర్కింగ్ ఏజెన్సీలకు పనులను అప్పగిస్తామని తెలిపారు.

ఆలయం పైకి తాగునీటిని సరఫరా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా తరలివస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్ డిపో, బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి విడుదల చేస్తామని, వారం రోజుల్లోగా వాటి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. అవసరాల ప్రాతిపదికన నిర్మాణాన్ని విస్తరించుకోవాలని సీఎం సూచించారు. మూడు నెలల్లోగా ఈ పనులు పూర్తి కావాలని అన్నారు.

రింగ్ రోడ్ పరిధిలో ఉన్న కొందరు తమకు న్యాయం చేయాలని సీఎంకు వినతి పత్రం అందించగా, వారిని ఈఓ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కడుపునిండా పరిహారం ఇస్తామని ఎవరూ ఆందోళన చెందే అవసరం లేదని సీఎం వారికి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో వీరికి ప్రాధాన్యతనిచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. రింగు రోడ్ లోపల 5 వేల వాహనాల సామర్థ్యం గల పార్కింగును ఏర్పాటు చేయాలని అన్నారు.