తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేది. కానీ ఇకపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన రేవంత్...ఆరోగ్య శ్రీ పై కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై రాష్ట్రంలో రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ...అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని...ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలని సూచించారు.

అలాగే ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని స్పష్టం చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని తద్వారా మెరుగైన వైద్యం అందుతుందన్నారు.తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. 

తెలంగాణ అభివృద్ధి పథకంలో నడవాలంటే ప్రధాన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని తెలిపారు సీఎం రేవంత్. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని... కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించే తీరుగా కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన రావాలని ఆకాంక్షించారు.

ప్రజాహితమే ధ్యేయంగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని...అభివృద్ధి-సంక్షేమం జోడెడ్లుగా ముందుకు సాగుదామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజాపాలనలో ప్రజల నుండి వస్తున్న దరఖాస్తులను గుర్తించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ జిల్లాల ఎస్పీలు,ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.