Hyderabad, May 18: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై, ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి సచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్​రెడ్డి వివరించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా 

రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాటి కేబినేట్ భేటీ జరగకపోవడంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్‌లనును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.