Hyderabad, October 02: సమ్మె బాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు మంగళవారం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం అందుకనుగుణంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీస్ కుమార్ అధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కాగా, ఈ కమిటీతో బుధవారం ఆర్టీసి కార్మికవర్గం (TSRTC JAC) జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లుగానే అక్టోబర్ 05 నుంచి తాము తలపెట్టిన సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి కమిటీలు వేశారని, ఇలాంటి కమిటీల ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన తెలిపారు.
ప్రభుత్వం మరియు కమిటీ తమ డిమాండ్లు నెరవేర్చడం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని అశ్వద్ధామ కోరారు. తాము కూడా సమస్య పరిష్కారం దిశగానే ఆలోచిస్తున్నామని, అయితే తమ ప్రధాన డిమాండ్ 'ఆర్టీసీ విలీనం' (TS RTC Merge) సహా మిగతా 26 డిమాండ్ల కోసం పోరాటం చేస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ తేల్చిచెప్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులంతా దృఢ సంకల్పంతో సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. టీఎస్ ఆర్టీసీ నిల్, ప్రైవేట్ ఫుల్! టైం చూసి 'స్ట్రైక్' దెబ్బ కొడుతున్న ఆర్టీసీ కార్మికులు
కాగా, ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రి మండలి సూచించింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రి మండలి కోరింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు పోయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది. ఇదే విషయాన్ని కమిటీ అధ్యక్షుడు సోమేశ్ కుమార్ ఆర్టీసి కార్మిక సంఘాలకు తెలియజేయగా, అందుకు వారు ప్రభుత్వం కూడా ఇటు కార్మికుల వైపు నుంచి, అటు ప్రజల వైపు నుంచి ఆలోచించి అందరి కష్టాలు తీర్చే విధంగా తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతున్నారు.
కార్మిక సంఘాలు పట్టువిడువకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాల్సి వస్తుందని సోమేశ్ కుమార్ అన్నప్పుడు, ప్రభుత్వం ఎలాంటి ప్లాన్‌లతో ఉన్నా సమ్మె మాత్రం ఆగదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.