Hyd, Mar 22: తెలంగాణలో ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ కలవరం పుట్టిస్తోంది. ఈ వైరస్ కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్‌లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 344కి చేరుకుంది. ఈ వేరియంట్ వైరస్ అధిక వ్యాప్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీవ్రతను ఇంకా నిర్ణయించలేదని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ సోకినవారు ఇప్పటివరకు తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడేవారు మాస్‌్కలు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మంగళవారం 5,122 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..వారిలో 23 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 52 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 190 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు.