Heatstroke (Representational Image; Photo Credit: Pixabay)

Hyd, June 13: తెలంగాణలో మరో 10 రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తేమ మొత్తం అటు వైపునకు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్‌ మాసంలో వానలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు

ఇంకా ఆగని తుపాను విధ్వంసం, గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపుకు మళ్లిన బిపర్‌జాయ్‌, పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ 1న రుతుపవనాలు కేరళను తాకడం జరుగుతుందని, తరువా జూన్‌ 10న తెలంగాణకు రుతుపవనాలు రావడం జరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే, ఈసారి రుతుపవనాలు కేరళను 8న తాకడం వల్ల తెలంగాణలో 18న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడటం, కిందిస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో రాబోయే మరో వారం, పది రోజుల వరకు ఎండల తీవ్రత తప్పదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం గ్రేటర్‌లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరేబియాలో ఏర్పడిన తుఫాను బలహీనపడి, పూర్తిగా తొలగిపోతే తప్ప.. రుతుపవనాల కదలికలో వేగం పెరిగే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.