
Hyderabad, JAN 25: సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్లు తినడంతోపాటు ‘ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా?’ (How to eat free Chocolate) అంటూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకులపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ (D Mart) సూపర్ మార్కెట్‌లోకి ఇటీవల హనుమంతనాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను తింటూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీయడంతోపాటు బిల్లు చెల్లించకుండా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా? అంటూ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టు చేశాడు. మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను తస్కరించిన హనుమంత్‌నాయక్‌తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.