Hyderabad, July 14: డీఎస్సీ పరీక్షలను (DSC Exam) వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 11,062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా.. మరో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. 5-6వేల పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన (Unemployment Youth Protests) అవసరం లేదని, ఇదే చివరి డీఎస్సీ కాదని అభ్యర్థులకు సూచించారాయన. మరో డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 5 నుంచి 6వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
Hon'ble Deputy Chief Minister Bhatti Vikramarka Press Meet Live https://t.co/0GvAODc5fb
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 14, 2024
”రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ. యువతకు ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటి 3 నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగాలిచ్చాం. డీఎస్సీ ఆలస్యమైతే పేద విద్యార్థులకు మరింత నష్టం జరుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో స్టాఫ్ కొరత ఉంది. డీఎస్సీతో ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలని అనుకున్నాం.
విద్యావ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని డీఎస్సీ ప్రకటించాం. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. పదేళ్లు అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించలేదు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపత్రయపడ్డారు.
5 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించనందున మా ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం. 19, 718 మంది టీచర్లు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాం. ఇప్పటికే 2 లక్షల 500మందికి పైగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మొత్తం 2 లక్షల 79 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ పోస్ట్ పోన్ చేయమని కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చాం.
గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించాం. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ పోన్ చేసింది. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ మేం షెడ్యూల్ చేశాం. ఇవన్నీ నిరుద్యోగులకు నష్టం కలగొద్దని మా ప్రయత్నం. ఇవి కాక వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 13,321 పోస్టులను టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నాం. డీఎస్సీని కూడా పకడ్బందీగా నిర్వహిస్తాం. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నాం” అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.