Hyderabad, June 2: తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే (Digital Land Survey in TS) నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు.
వీటిలోని 3 గ్రామాలు గజ్వేల్ నియోజక వర్గం నుంచి మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని సీఎస్‌కు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆస్తులకు రక్షణ విషయంలో ప్రభుత్వాలు అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకే డిజిటల్ సర్వే (Digital survey of agricultural lands in Telangana) చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
రేపటి భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా, శాశ్వతంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంలో భాగంగానే డిజిటల్ సర్వే నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. భూముల డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమీక్షలో సర్వే విధి విధానాలపై చర్చించిన సీఎం.. రైతుల భూముల్లో ఇంచు తేడా లేకుండా కొలతలు వచ్చేలా అత్యాధునిక సాంకేతికతో సర్వే చేపట్టాలని సూచించారు. ఎలాంటి తప్పులకు తావిచ్చినా చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ తెచ్చామని ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే ద్వారా అక్షాంశ-రేఖాంశాలను గుర్తించి తద్వారా పట్టాదారులకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు.
కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా రైతులకు సేవచేసే ఉద్దేశంతో సర్వే నిర్వహించాలని ఏజెన్సీ ప్రతినిధులను సీఎం కోరారు.పైలట్ సర్వేతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకుని పూర్తి స్థాయి సర్వేకు విధి విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల సర్వే అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చెప్పారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భూపరిపాలనలో గుణాత్మక మార్పులు రోజు రోజుకూ చోటుచేసుకుంటున్నాయని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండి...’’ అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు.
గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం ఏజెన్సీలకు అందిస్తుందని, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు అందుబాటులో వుంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని సీఎం చెప్పారు. కాగా సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేనన్నారు.