Hyderabad, June 2: పాకిస్తాన్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు (Hyderabad techie returns home) విడుదలయ్యాడు. నాలుగేళ్లపాటు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీీ సజ్జనార్ ని కలిసి ధన్యవాదాలు తెలిపాడు.ఈ యువకుడిని తీసుకురావడంలో ఇండియాతో పాటు తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు మరచిపోలేని సహాయం చేశారని హైదరాబాద్ టెకీ అన్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ (Prashanth Vaindan) అదృశ్యమయ్యాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తమ కుమారుడు మిస్సయ్యాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 11న మిస్సయ్యాడని అప్పటి నుంచి ఆచూకి లేదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఆ తరువాత, అతను తన ప్రేయసిని కలవడానికి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పాకిస్తాన్ జైలులో (Pakistan jail) ఉన్నానని పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా సైట్లలో కనుగొనబడింది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత, అతని తండ్రి బాబు రావు సహాయం కోసం సైబరాబాద్ పోలీసులను మరియు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించారు.
"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రి మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపిన తరువాత, ప్రశాంత్ ను మే 31 న విడుదల చేసి భారత అధికారులకు అప్పగించారు, ఆయనను మాధపూర్ ఇన్స్పెక్టర్ పి. రవీంద్ర ప్రసాద్ కు పంజాబ్‌లోని అటారీలో అప్పగించారని సజ్జనార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన బాబూరావు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ప్రశాంత్ బెంగళూరులోని హువాయ్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతని సోదరుడు శ్రీకాంత్ తన భార్యతో కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దీంతో బాబూరావు దంపతులు తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వచ్చి, కేపీహెచ్‌బీ భగత్‌సింగ్‌నగర్ ఫేజ్–1 ద్వారకామయి అపార్ట్‌మెంట్‌లో శ్రీకాంత్‌తో కలిసి ఉంటున్నారు.
Here's Cyberabad Police Tweet
♦️Prashanth Vaindan who was jailed in Pak for 2 Yrs,
repatriated to India.
♦️ He thanked the Indian, Telangana governments
& #cyberabadpolice for helping in the process of
coming back.
https://t.co/WeWhcqdcRc@RachakondaCop @hydcitypolice pic.twitter.com/8wZaeaFEcJ
— Cyberabad Police (@cyberabadpolice) June 1, 2021
బెంగళూరులో ఉంటున్న సమయంలో స్వప్నికా పాండే అనే మధ్యప్రదేశ్‌కు చెందిన యువతితో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పట్లోనే స్వప్నికకు మరో ఉద్యోగం రావడంతో స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. తర్వాత కొంతకాలం చైనాలో, ఆఫ్రికా దేశాల్లోనూ, చివరకు హైదరాబాద్‌లో.. ఇలా ఎన్నోచోట్ల ఉద్యోగాలు మారినా స్వప్నికను ప్రశాంత్ మరచిపోలేకపోయాడు. చివరకు ప్రశాంత్ ప్రేయసి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2017 ఏప్రిల్ 11న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన ప్రశాంత్ తిరిగి రాలేదు. దీంతో బాబూరావు అదే నెల 29న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా తాను పాకిస్తాన్‌లో అరెస్టు అయ్యాననే సమాచారాన్ని ప్రశాంత్ 2019 నవంబర్ ఆఖరి వారంలో తన తండ్రికి తెలిపాడు. అక్కడి కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది సహకారంతో ఫోన్‌లో మాట్లాడాడు. సెల్ఫీ వీడియో కూడా పంపాడు.
బాబూరావు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి విషయం చెప్పి తన కుమారుడు తిరిగి వచ్చేందుకు సహకరించాలని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ద్వారా చర్యలు చేపట్టింది. ఈ కృషి ఫలితంగా ప్రశాంత్ ఎట్టకేలకు సోమవారం విడుదలయ్యాడు. పాక్ రేంజర్లు వాఘా సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారుల సమక్షంలో తెలంగాణ పోలీసులకు ప్రశాంత్‌ను అప్పగించారు.
దీంతో మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు అప్పగించారు. కాగా, తమ కుమారుడు పాకిస్తాన్ చెర నుంచి విడుదలై, హైదరాబాద్ చేరుకున్నాడని సీపీ సజ్జనార్ ఫోన్ చేసి చెప్పారని.. విశాఖలో ఉంటున్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఆనందంతో ‘సాక్షి’కి తెలిపారు.
సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇంట్లోంచి వెళ్లిన ప్రశాంత్ స్విట్జర్లాండ్‌కు నడిచి వెళ్లాలని భావించాడు. పర్సు, ఫోన్ ఇంట్లోనే వదిలి బయలుదేరిన అతడు తొలుత రైల్లో రాజస్థాన్‌లోని బికనీర్ వెళ్లాడు. అక్కడ కంచె దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని తుబాబరిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 2019 నవంబర్ 14న చిక్కాడు.
ఆ సమయంలో అతని వెంట మధ్యప్రదేశ్‌కు చెందిన దరియాలాల్ కూడా ఉన్నాడు. ఇద్దరినీ అరెస్టు చేసిన బహవల్‌పూర్ పోలీసులు కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1952 కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశాంత్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చేపట్టి సఫలీకృతం అయ్యాయని సీపీ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ తండ్రి బాబురావు మాత్లాడుతూ.. మా కుమారుడిని వెనక్కు రప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేశాయని అన్నాడు. అధికారులు, నిరంతరం పాక్‌తో సంప్రదింపులు జరిపారని తెలిపారు. దీని ఫలితంగానే మా అబ్బాయిని ఇంత తొందరగా చూడగలిగామని ప్రశాంత్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సహయత అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సహకారం తమ జీవితంలో మరిచి పోలేమని అన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రశాంత్ కూడా తన తల్లిదండ్రులను చేరిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. తన జీవితంలో అమ్మనాన్నలను కలుస్తానని అనుకోలేదని అన్నాడు. తనలాగే పాక్లోవివిధ కారణాలతో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. అయితే, అక్కడ ఇరుకున్న మన వారి జాబితాను భారత ప్రభుత్వానికి ఇచ్చానని ప్రశాంత్ తెలిపాడు. వీరిని కూడా వీలైనంతా త్వరగా మనదేశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే, పాక్‌లో తాను ప్రవేశించిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
‘తాను మొదట ఇండియా, పాక్ బార్డర్ చేరుకున్నానని పేర్కొన్నాడు. అక్కడ ఎవరు పట్టుకోలేదని, దాదాపు 40 కిలోమీటర్లు ఎడారిలో ప్రయాణించానని తెలిపాడు. తిరిగి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం సాధించి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని అన్నాడు. ‘ ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల మాటలు వినాలని, తనలాగా వేరేవరు కష్టపడొద్దని కోరుకుంటున్నానని తెలిపాడు.