Cash for Vote Scam: ఓటుకు నోటు కేసు, మల్కాజిగిరి ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు, విచారించకుండానే రేవంత్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం, ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
Congress MP Revanth Reddy | File Photo

Hyderabad, June 1: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు (2015 Cash for Vote Scam) ఏసీబీ పరిధిలోకి రాదని.. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం (High Court) కొట్టివేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్‌ (Malkajgiri MP revanth reddy) తన పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గతంలో ఏసీబీ కోర్టు (ACB Court) కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది.

కాగా ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు దొరికి పోయిన సంగతి విదితమే. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది.

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు, ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ, చంద్రబాబుకు కష్టాలు తప్పవా?

ఇక ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు గతవారం నోటీసులు జారీచేసింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేవంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం.. ఆ కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలిన తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఓటుకు కోట్లు కేసు, సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు, స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని కోర్టుకు వివరణ

తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి విడుదల, బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్, మరొవైపు నుంచి తముకొస్తున్న 'ఓటుకు నోటు' కేసు

ఇక, ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విరామం తర్వాత ఈడీ మే 27న నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ చార్జ్ షీట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ.. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నట్టుగా తెలిసింది. మనీలాండరింగ్‌ నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ చార్జ్ షీట్‌లో రేవంత్‌రెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌, రుద్ర ఉదయ్‌సింహ, జెరూసలెం మత్తయ్య, వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్‌ పేర్లను ఈడీ అధికారులు పేర్కొన్నారు.