Congress MP Revanth Reddy | File Photo

Hyderabad, March 18: అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీపై డ్రోన్ ఎగురవేసిన కేసులో (Drone Case)  అరెస్టయి, గత 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఎట్టకేలకు బెయిల్ లభించింది. రూ. 10 వేలు చొప్పున ఇద్దరు వ్యక్తుల జామీనుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ బుధవారం రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది దాఖలు చేసిన మరో పిటిషన్ పై విచారణను మాత్రం కోర్ట్ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ (KTR's farmhouse) డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్లు రేవంత్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో దీనిపై కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, ఆయనను మియాపూర్ కోర్టులో హాజరుపరచటంతో కోర్ట్ రేవంత్ రెడ్డికి రిమాండ్ విధించింది.

అయితే తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు ఈరోజు బెయిల్ లభించింది.

డ్రోన్ ఎగరవేత కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి 14 రోజులుగా జైలులో ఉండటం పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. చిన్నచిన్న సెక్షన్లకే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఇన్ని రోజులుగా జైలులో ఉంచడమేంటి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణలోని పరిస్థితులను కేంద్ర హోంమంత్రికి వివరిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా,  మరోవైపు రేవంత్ రెడ్డి 'ఓటుకు నోటు' (Vote for Note Case) కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న మంగళవారం ఏసీపీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఎంపీ రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన తరఫు న్యాయవాదులు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నందున విచారణకు హాజరు కాలేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్ట్ ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.