2015 Cash for Vote Scam (Photo-Video Grab)

Hyd, Nov 20: తెలంగాణ రాష్ట్రంలో 2015లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో (2015 Cash for Vote Scam) ఏ2గా ఉన్న బిషప్‌ సెబాస్టియన్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై (Sebastian's discharge petition) ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్‌తో ఈ కుట్రలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును (ACB Court) కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. కాగా ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌కు అనుకూలంగా ఓటు వేయాలని స్టీఫెన్‌సన్‌తో మొదట రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది సెబాస్టియనేనని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌ రెడ్డితో కలిసి స్టీఫెన్‌సన్‌ ఇంటికి సెబాస్టియన్‌ వెళ్లి రూ.2.5 కోట్లు తీసుకుని ఓటు వేయాల్సిందిగా బేరసారాలు జరిపారని వివరించారు. అనంతరం సెబాస్టియన్‌, రేవంత్‌ రెడ్డి, రుద్ర ఉదయ్‌సింహా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లారని, నగదు ఉన్న బ్యాగును అక్కడే ఉంచారని కోర్టుకు వివరించారు.

ఓటింగ్‌ తర్వాత రూ.4.5 కోట్లు చెల్లిస్తామని స్టీఫెన్‌సన్‌కు హామీ ఇచ్చారన్నారు. ట్రాప్‌ చేసి పట్టుకుని కేసు నమోదు చేశామని చెప్పారు. కేసుతో సంబంధం లేదని పిటిషనర్‌ ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం లేదని డిశ్చార్జి పిటిషన్‌ డిస్మిస్‌ చేయాలని ఏసీబీ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయ్‌సింహా దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.