Hyderabad, JAN 15: బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-E Race case)లో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్‌పై ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసింది.
ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్ (KTR) హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ క్వాష్ పిటిషన్ తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని తెలపడంతో ఈడీ కేటీఆర్‌కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు బుధవారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్‌కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.