Electricity Bills (Photo-File Image)

ఇకపై ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నిలిపివేసినట్టు టీజీఎస్‌పీడీసీఎల్ ప్రకటించింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ సైతం (APEPDCL) తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్‌ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. యూపీఐ యాప్‌ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్‌ సైట్, యాప్‌ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌పే, గూగుల్‌ వంటి చెల్లింపు గేట్‌వేల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు.

కాగా యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపు పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉందని, కొన్నేళ్లుగా తమ నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు చెల్లింపు గేట్‌వేలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రకటనపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కఠినమైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యంలో ఒక అడుగు వెనక్కి వేశారంటూ పలువురు వినియోగదారులు వ్యాఖ్యానించారు. ఐఫోన్ వినియోగదారులకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు ఒక్క యాప్ కూడా అందుబాటులో లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. బీబీపీఎస్ (భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్) ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని పలువురు సూచించారు.

కాగా బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బిల్లు చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్స్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.