Warangal, Feb 27: వరంగల్ (Warangal) ఎంజీఎం (MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పీజీ విద్యార్థిని ప్రీతి మరణించింది. నిమ్స్ (NIMS)లో చికిత్స పొందిన ఆమె నిన్న రాత్రి 9.10 నిమిషాలకు మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా, ప్రీతి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల పరిహారానికి తోడు ఆయన కూడా రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.
గత రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రీతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని తొలుత ప్రకటించారు. తాజాగా, ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షలతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించినట్టు తెలిపారు.అలాగే, పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రీతి మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.