Hyderabad, December 02: తెలంగాణ ఆర్టీసీ (TSRTC) సమ్మె పరిణామాల నేపథ్యంలో, నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే క్రమంలో బస్సు ఛార్జీలను (Bus Fares) కిలో మీటరుకు 0.20 పైసల చొప్పున పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల ఆర్టీసీకి ఏడాదికి రూ. 750 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఛార్జీల సవరణలు అధికారులు వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే ఛార్జీల పెంపు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం పల్లె వెలుగు మరియు సిటీ సబర్బన్ ఆర్డినరీ బస్సుల్లో (Pallevelugu/ Ordinary) కనీస ఛార్జీ రూ. 10 గా నిర్ణయించారు.
కండక్టర్ - ప్రయాణికుల మధ్య ఏర్పడే చిల్లర సమస్యను అధిగమించడం కోసం పెంపిన ఛార్జీలను రూ. 15, 20, 25, 30 క్రమంలో రౌండాఫ్ చేశారు. గరిష్టంగా ఛార్జీల పెంపు రూ. 100గా నిర్ణయించారు.
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 15, డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 20, సూపర్ లగ్జరీల్లో రూ. 25, ఏసీ బస్సులైన రాజధాని, గరుడ, గరుడ ప్లస్, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీలు రూ. 35 గా నిర్ణయించారు. ఇక వెన్నెల ఏసీ స్లీపర్ కోచ్ బస్సుల్లో కనీస ఛార్జీగా రూ. 70 వసూలు చేయనున్నారు. ఈ మేరకు పెరిగిన ఛార్జీలను టిమ్ యంత్రాల్లో అధికారులు నిక్షిప్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ఇంటికి పిలిచి, భోజనం పెట్టి, వరాలిచ్చిన సీఎం కేసీఆర్
దీని ప్రకారం పల్లెవెలుగు బస్సుల్లో 50 కిమీ దూరానికి ఇక నుంచి రూ. 42 ఛార్జీ చేయబడుతుంది. ఆయా రూట్లను బట్టి టోల్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి. అలాగే బస్సు పాసుల ఛార్జీలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. స్టూడెంట్ జనరల్ మంత్లీ బస్ పాసు ధర రూ. 165, అలాగే క్వార్టర్లీ బస్ పాసుకు ధర రూ. 495 గా వసూలు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 50 అదనంగా ఛార్జీలు ఉండనున్నట్లు తెలుస్తుంది.
ఇక జనరల్ ప్రయాణికులకు నెల గడువుతో లభించే బస్ పాస్ (Monthly Pass) ఛార్జీలు ఇకపై వరుసగా ఆర్డినరీ అయితే రూ. 950/-, మెట్రో ఎక్స్ ప్రెస్ రూ. 1070/- , మెట్రో డీలక్స్ పాస్ కోసం రూ. 1185/- చెల్లించాల్సి ఉంటుంది.