
Bollaram, Oct 14: హైదరాబాద్ (Hyderabad) శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం (IDA Bollaram Fire Accident) సంభవించింది. ఇక్కడి అమర్ ల్యాబ్స్ లో (Amar Labs) గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు నైట్‌షిఫ్ట్ లో పనిచేస్తుండగా వారిలో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, పేలుడు శబ్దానికి భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలో గాడాంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లోపల ఎంతమంది చిక్కుకున్నారనే విషయంలో స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.