Hyderabad, Mar 20: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంబరాల్లో అపశృతి (fire-broaken-in-telangana-bhavan) చోటుచేసుకుంది. హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం (Fire at Telangana Bhavan) సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్ లో ఓ అంతస్తు దగ్ధవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే అగ్ని ప్రమాదానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు. ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు.
రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు రోజుల పాటు సాగింది.తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ విజయం దక్కకపోవడంతో మొత్తం 91 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ చేశారు.
Here's Fire Video
#TelanganaBhavan #FireAccident @KTRTRS pic.twitter.com/7CHv9JZJc4
— Andhra Prabha Official (@AndhraPrabhaApp) March 20, 2021
ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతగా 1, 12, 689 ఓట్లు రాగా..36, 580 ఓట్లు రెండో ప్రాధాన్యతగా వచ్చాయి. మొత్తంగా ఆమె 1, 49, 249 ఓట్లు సాధించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుకు తొలి ప్రాధాన్యత ఓట్లు 1,04, 068 రాగా, రెండో ప్రాధాన్యతా ఓట్ల కింద 32,898 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఆయన 1, 37, 568 ఓట్లు సాధించారు. వాణిదేవి విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.