గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో విలయాన్ని సృష్టించాయి. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాపై వర్షాలు పంజా విసిరాయి. విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.ఇక తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఐఎండీ వాతావరణంపై అప్ డేట్ ఇచ్చింది.
ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది. వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన
తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈరోజు (సోమవారం) మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దీని ప్రభావంతో తెలంగాణ మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5తేదీన కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పలుచోట్ల కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వరదలకు 16 మంది మృతి, బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం ప్రకటించిన ప్రభుత్వం, మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
అత్యవసరమైతే తప్ప భాగ్యనగరవాసులు బయటకు రావొద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు ప్రకటన జారీ చేశారు. భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని, నాలాలు పొంగిపొర్లుతున్నాయని తెలిపింది. ప్రజలు నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది.
వాహనదారులు, పాదచారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని అనవసరంగా బయటకు పంపించకూడదని సూచించింది. "ఇంట్లోనే ఉండండి... జాగ్రత్తగా ఉండండి... మీ భద్రత మా బాధ్యత" అని జీహెచ్ఎంసీ పేర్కొంది.భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో నిర్మాణాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సూచించింది. సెప్టెంబర్ 1 నుంచి పలు ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ అయిన విషయాన్ని గుర్తు చేసింది.