Bhadrachalam, July 21: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు. ఈ క్రమలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నది.
48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో వరద పెరిగే అవకాశం కనిపిస్తున్నది. అయితే, 1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్ఠంగా గోదావరికి 75.60 అడుగులకు నీటిమట్టం చేరుకున్నది. ఆ నాటి నుంచి నేటి వరకు ఇదే రికార్డు. 2022లో కురిసిన భారీ వర్షాలకు 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది.