Hanumakonda, AUG 16: అమెరికాలో మరో తెలుగు యువకుడు (Young Man Died) మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్(32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో అస్వస్థతకు గురైన రాజేశ్ మూడు రోజుల క్రితం మరణించాడు. రాజేశ్ మరణవార్తను కుటుంబసభ్యులకు అతని స్నేహితులు ఫోన్ చేసి తెలిపారు. ఈ విషయం తెలియగానే రాజేశ్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, ఆర్థిక సమస్యలతో రాజేశ్ తండ్రి కొన్నేండ్ల క్రితమే మరణించాడు. ఇంతలోనే రాజేశ్ కూడా కన్నుమూయడంతో అతని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రాజేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.