ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమురం భీమ్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు
ఈరోజు దేశ వ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి.