Hyd, July 8: వర్షాలపై వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు (Meteorological department experts ) వెల్లడించారు.శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా (low pressure) ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ నెల 15న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, ఏపీ వైపుగా వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 23న తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని, ఇది క్రమంగా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. షాకింగ్ వీడియో, వాగు దాటుతూ మహిళ గల్లంతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘటన..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు ఖమ్మం, జనగామ, సూర్యాపేట, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
శనివారం దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఆదివారం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.