Hyderabad, November 20: రాష్ట్రంలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ (RTC Routes Privatization) అంశం హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విపక్ష పార్టీలు హైకోర్టు ((High Court of Telangana))లో పిటిషన్ దాఖలు చేశాయి. నవంబర్ 7 నుంచి ఈ అంశంపై విచారణ చేపడుతూ వస్తున్న హైకోర్ట్, దీనిపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తుండగా, మరోసారి దీనిపై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా హైకోర్ట్ ఎదుట చర్చకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్స్ సిగ్నల్ ఇస్తూ గతంలోనే డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పిటిషనర్లు మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దీనిపై కూడా హైకోర్ట్ విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది జూన్ నెలలోనే జరగాల్సి ఉండేవి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పక్షాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.