High Court of Telangana suggests unions to stop the Strike | File Photo

Hyderabad, October 15 : తెలంగాణలో గత 11 రోజులుగా ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తక్షణమే సమ్మె విరమించాల్సిందిగా కార్మిక సంఘాలకు సూచించింది. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె  వివాదంపై ఈనెల 6న హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే, రెండు పర్యాయాలు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్ట్ నేడు తీర్పు వెలువరించింది.

వాదనల సందర్భంగా ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు  తెలిపింది. ఒకవేళ విలీనం చేస్తే మిగతా ప్రభుత్వ కార్పోరేషన్ లు కూడా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తాయని వెల్లడించింది. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని, 75 శాతం బస్సులు యధావిధిగా నడుస్తున్నాయని, మిగతా బస్సులు కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడగించారని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. సుమారు 4 వేల బస్సులు నడవకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపిన ధర్మాసనం, వెంటనే కార్మికులతో సమ్మె విరమింపజేసి వారిని చర్చలకు ఆహ్వానించాల్సిందిగా ప్రభుత్వానికి  సూచించింది.

ఆర్టీసీ కార్మిక సంఘాలపై హైకోర్ట్ ఆగ్రహం

కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతం కావొచ్చు కానీ పండగ సమయంలో సమ్మెకు వెళ్లి రవాణా నిలిపివేస్తే ఎలా? అని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులపై ఎస్మా చట్టం ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని ఆర్టీసీ సంఘాలను సూటిగా ప్రశ్నించింది. ఇది కేవలం ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల సమస్య కాదని, ప్రజా సమస్య కూడా అని, ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్ట్ వారికి సూచించింది.

ఆర్టీసీ ఎండీని నియమించి కార్మికుల్లో విశ్వాసం పెంచాలని ప్రభుత్వానికి సూచించిన హైకోర్ట్, ఇందుకోసం తీసుకున్న చర్యలను మళ్ళీ తమ ఎదుట వినిపించాలని తదుపరి విచారణను అక్టోబర్ 18కివాయిదా వేసింది.

సందిగ్ధంలో కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలకు ఉద్యోగ సంఘాల మద్ధతు

హైకోర్ట్ ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్టీసీ సంఘాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అయితే ప్రస్తుతానికి సమ్మె కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు టీఎన్జీవో నేతలను కలిసిన ఆయన తమకు మద్ధతు తెలపాలని వారిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందిచిన ఉద్యోగ సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్ధతును ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలతో పాటు, ఆర్టీసీ కార్మికుల సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని, సీఎంతో చర్చల అనంతరం భవిష్యత్ కార్యాచరణపై  నిర్ణయించుకుంటామని తెలిపారు. సీఎంతో చర్చల కోసం టీఎన్జీవో అధ్యక్షుడు రవీంధర్ రెడ్డిని పంపాలని నిర్ణయం తీసుకున్నారు.