Sanga Reddy, May 03: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో భారీ సైబర్ చీటింగ్ కేసు (Cyber Fraud) వెలుగుచూసింది. ఆన్ లైన్ టాస్క్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలను మోసం చేశారు. వారి నుంచి రూ.25లక్షలు దోచుకున్నారు. ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలు కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ మోసాల (Cyber Fraud) పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు అవహగాన కల్పిస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. సైబర్ మోసాలు ఆగడం లేదు, మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు. ప్రజల అత్యాశను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు.
మాయ మాటలతో నమ్మించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా గిఫ్ట్ ల పేరుతో ఇద్దరు మహిళలకు గాలం వేసి వారి నుంచి ఏకంగా 25లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో వెలుగుచూసింది. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఎంక్లేవ్ కాలనీలో నివాసం ఉండే ఇద్దరు మహిళలను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. మంచి గిఫ్ట్ లు ఇస్తామని ఆ ఇద్దరినీ నమ్మించారు. టాస్క్ పేరుతో ఆన్ లైన్ (Cyber Fraud) ద్వారా మొత్తం 25లక్షల 23వేల 375 రూపాయలు కాజేశారు. ఓ మహిళ నుంచి 20లక్షల 63వేల 375 రూపాయలు, మరో మహిళ నుంచి రూ.4లక్షల 60వేలు కొట్టేశారు. విలువైన బహుమతులు (Gifts) వస్తాయని నమ్మిన మహిళలు భారీ మొత్తంలో నగదను ట్రాన్స్ ఫర్ చేసేశారు.
డబ్బులు పంపించాక కేటుగాళ్లు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. దాంతో తాము మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తమకు వచ్చేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. బహుమతుల పేరుతో ఇద్దరు మహిళల నుంచి రూ.25లక్షలు కాజేసిన వైనం స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులను విస్మయానికి గురి చేసింది. ఆ ఇద్దరు మహిళలు మరీ అంత గుడ్డిగా నమ్మి ఎలా మోసపోయారని చర్చించుకుంటున్నారు. సైబర్ మోసాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటి చెప్పింది. కాగా, గతంలో కూడా ఇలాంటి సైబర్ మోసాలు అనేకం జరిగాయి. ఇన్ని జరుగుతున్నా ఇంకా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు. అత్యాశకు పోయి అడ్డంగా మోసపోతున్నారు. లక్షలకు లక్షల డబ్బు చేతులారా పోగొట్టుకుంటున్నారు. మనలోని అత్యాశని, బలహీనతలను, అమాయకత్వాన్ని కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.