Hyd, Feb 21: పెళ్లికి పాత మంచం పెట్టారని వరుడు పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన (Groom Cancels Wedding) హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి.
ఈ నేపథ్యంలో అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే (Receiving Used Furniture in Dowry) వరుడికి కట్నం కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే అన్నిటికి ఒకే చెప్పిన వరుడు మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని షరతు పెట్టాడు. ఆదివారం నాడు పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు.
ఇక వచ్చిన వస్తువుల్లో మంచం విడి భాగాలతో వరుడు మంచం బిగిస్తుండగా కాళ్లు విరిగిపోయాయి. దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వరుడు పెళ్లి రోజు పెళ్లీ పీటలు ఎక్కడం మానేశాడు. పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లి ఆరా తీయగా వరుడు చెప్పిన సమాధానంతో వారికి దిమ్మతిరిగినంత పనైంది. పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు వారిపై మండిపడ్డాడు.
కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని వధువు తల్లిదండ్రులతో తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.