HYderabad Rains (Photo-Twitter)

July 26: భాగ్యనగరాన్ని వరుణుడు వీడటం లేదు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం (Hyderabad Rains) ముంచెత్తింది. భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. యాకుత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు (Heavy Rains) వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలు చోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. వరద ప్రవాహంలో పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి.

తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ 9.2 సెంటీమీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీమీటర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0 సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గరిష్టంగా వికారాబాద్‌లో 13 సెం.మీ, నగరంలో హస్తినాపురంలో వర్షపాతం నమోదు అయ్యింది. మద్గుల్ చిట్టెంపల్లిలో 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

షాకింగ్ వీడియోలు, హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతున్న బైక్‌లు, కార్లు, భాగ్యనగరాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు

జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్‌, శంకర్‌పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.

Here's Rachakonda Police Tweet

మూసారంబాగ్‌-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ కింద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలో రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో వర్షాలకు నీరంతా నిలిచిపోయింది. గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. మహబూబాబాద్‌ అర్పనపల్లి వద్ద వట్టివాగు పొంగి ప్రవహిస్తున్నది. కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.సరూర్‌నగర్‌, కోదండరాంనగర్‌ లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. సూరారం తెలుగుతల్లి నగర్‌లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

వర్షానికి హుస్సేన్‌సాగర్‌ వరద పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోయింది. ప్రస్తుతం నీటిమట్టం 513.45 మీటర్లు ఉన్నది. పూర్తిస్థాయినీటిమట్టం 513.41 మీటర్లు. మరో వైపు జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ఉస్మాన్‌సాగర్‌ నుంచి మూసీలోకి 1,278 క్యూసెక్కుల వరదను అధికారులు విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కుల ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 1778 అడుగులున్నది. హిమాయత్‌సాగర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో 325 క్యూసెక్కులు ఉండగా.. మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1,760.70 అడుగుల నీరున్నది.