Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వానలు, నగరంలో ఒక్కసారిగా వరదలొచ్చాయా అన్నంత రీతిలో కుంభవృష్టి, గత వందేళ్లలో ఇదే అత్యధికం, హైల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే!
Hyderabad Rains | Photo - PTI

Hyderabad, September 25:  భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నీట మునిగింది, రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మంగళ వారం రోజంతా అత్యధిక వర్షపాతం నమోదైంది. గరిష్టంగా 7 నుంచి 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత వందేళ్లలో నగరంలో ఇంతటి భారీ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. బుధవారం కూడా నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో కొన్ని గంటలూ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. భారీ వర్షానికి శంషాబాద్ విమానాశ్రయం రూట్‌లో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు కారణంగా నాలాలు ఉప్పొంగుతున్నాయి, నగర రోడ్ల మీద భారీ ప్రవాహాలు ఉండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులకు నరకం చూపిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం, ఆఫీసుల నుండి ఉద్యోగులంతా అప్పుడే బయటకు వస్తుండటంతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఐటీ ఉద్యోగులు వర్షం తగ్గాక బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగులంతా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు చేరాలని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అప్రమత్తమైంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో 040 - 21111111 నెంబర్‌కు లేదా 100 కు డయల్ చేసి సహయం కోరవచ్చునని తెలిపారు. అలాగే ఎక్కడైనా, ఏమైనా సమస్యలు తలెత్తితే 'MY GHMC' యాప్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా సూచిస్తున్నారు.

GHMC Tweet:

కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు కూలుతుండటంతో చెట్లకు, విద్యుత్ స్తంభాలకు మరియు ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని అధికారులు  విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఇప్పటికే రెస్క్యూ టీంలను పంపినట్లు తెలిపారు.జీహెచ్ఎంసీ సిబ్బంది లేకుండా మ్యాన్ హోల్ ఓపెన్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయం లేకుండా ఎవరూ మ్యాన్‌హోల్స్ తెరవకూడదని సూచిస్తున్నారు.