Hyd, Jan 5: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన యువతి (Daughter Raped by Father) ఇంటి నుంచి పారిపోయి మరొకరి చేతిలో మోసపోయి దారుణంగా రేప్ కు గురైంది. ఇళ్లు వదిలి ప్రియుడు దగ్గరకు వెళ్లిన ఆ యువతి.. ప్రియుడు ఆమెను ఇంటికి వెళ్లు అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వేరే వారిని జాబు కోసం ఆశ్రయించి మోసపోయింది.
పోలీసులు (Jeedimetla Police Launch Probe) తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌కు చెందిన ఓ కుటుంబం కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఇదే అదనుగా కామాంధుడైన తండ్రి ఆమెపై కన్నేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తల్లికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
ఇక గతేడాది దీపావళికి బిహార్‌కు వెళ్లివస్తుండగా.. రైలులో బీహార్ కు చెందిన యువకుడు సంతోష్ అయ్యాడు. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకుని ప్రేమికులు అయ్యారు. గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం అతడు కుత్బుల్లాపూర్‌లో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.
అయితే చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్‌కి పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్‌కు ఫోన్‌చేసి.. అతని సాయంతో సంతోష్ వద్దకు వెళ్లింది. మరుసటిరోజు ఇంటికి వెళ్లాలని ఆమెకు ప్రేమికుడు చెప్పాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లకుండా తనకు ఉద్యోగం ఇప్పించాలని వెంట వచ్చిన రవిని కోరడంతో.. అతడు అమీన్‌పూర్‌లో తన గదికి తీసుకెళ్లాడు. ఈ నెల 29న మద్యం మత్తులో రవి ఆమెను చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడి చేశాడు.
అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి కుటుంబీకులకు ఫోన్‌చేసి సికింద్రాబాద్ స్టేషన్ రావాలని చెప్పింది. వారు రావడంతో జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దర్యాప్తులో పోలీసులకు తన తండ్రి చేసిన అఘాయిత్యాన్ని కూడా ఆ బాలిక వివరించింది. దీంతో బాలిక తండ్రితో పాటు ఆ యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.