Hyderabad, June 21: హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. పెళ్లి పత్రికలో తల్లిదండ్రుల పేర్లు వేయలేదని ఇద్దరు సోదరులు, వారి సమీప బంధువులకు మధ్య జరిగిన గొడవ.. కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు చేర్యాల వీఆర్వోగా ఉన్నారు. తుకారాంగేట్ సీఐ ఎల్లప్ప వివరాల ప్రకారం.. ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన సురేష్ వివాహం సుష్మతో ఈనెల 16న జరగ్గా, 18న స్థానికంగా విందు నిర్వహించారు. ఇదే ప్రాంతానికి చెందిన సోదరులు పి.శేఖర్(26), పి.సర్వేశ్(20) పెళ్లి కుమారుడికి సమీప బంధువులు. తమ తల్లిదండ్రుల పేర్లు (Not Printing Names in Wedding Card) పెళ్లి పత్రికలో రాయలేదని వివాహం రోజున వారిద్దరూ వాగ్వాదానికి దిగారు.
4 రోజులుగా ఈ గొడవలు జరుగుతున్నాయి. విందు అనంతరం శేఖర్ అదే బస్తీలో నివసించే, బంధువైన బాలమణిని దూషించాడు. ఆదివారం పెద్దల సమక్షంలో మాట్లాడదామనుకున్నారు. చేర్యాల వీఆర్వో ప్రవీణ్(30), పరశురాం(35), ప్రతాప్‌కుమార్(32), బాలమణి, ఆమె భర్త యాదగిరి(42) కలిసి ఆదివారం వారి ఇంటికి వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఘర్షణకు దిగిన సోదరులు బాలమణి మినహా మిగతా నలుగురిపై కత్తితో దాడి చేసి (Four Stabbed During Argument) పరారయ్యారు. ప్రవీణ్, పరశురామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే పీఎస్‌కు వచ్చిన బాధితులను.. పోలీసులు ఉస్మానియాకు తరలించారు. యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఆన్‌లైన్‌లో కత్తి ఖరీదు చేసినట్లు తెలిసింది.