Innohub Technologies

Hyderabad, Oct 16: భారత్‌ లో (India) గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్‌ (Hyderabad), బెంగళూరు (Bengaluru) ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్‌ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోనే ఏర్పాటు కానున్నట్టు సీబీఆర్‌ఈ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌ వివిధ అంశాల్లో బెంగళూరును అధిగమించి మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తున్న విషయం విదితమే. ఈ రెండు నగరాల్లో మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవవనరులు అందుబాటులో ఉండటంతో పలు కంపెనీలు తమ గ్లోబల్‌ కేపబిలిటీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సీబీఆర్‌ఈ ఇండియా సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా చైర్మన్‌, సీఈవో అన్షుమన్‌ మ్యాగజైన్‌ స్పష్టం చేశారు.

ఎక్కడంటే??

భారత్‌లో ఆఫీస్‌ స్పేస్‌ను అందించడంలో బెంగళూరు, హైదరాబాద్‌ అత్యంత కీలకంగా మారనున్నాయని, వీటి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్‌, ముంబై ఉన్నాయని తెలిపారు. బెంగళూరులో కొత్త కార్యాలయాల ఏర్పాటు ఎక్కువగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు, నార్త్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నదని, హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌తోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.