Hyderabad, July 29: చేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? హైదరాబాద్ లోని కాటేదాన్ కు చెందిన అక్షిత్ రెడ్డి అనే యువకుడు అమెరికాలో ఈతకు వెళ్లి మృతి చెందగా అతని తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే మారింది. ఈ నెల 21వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెండ్లి పనుల్లో ఉండగా..
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు పాతికేండ్ల కిందట హైదరాబాద్ లోని కాటేదాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరి బిడ్డలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు అక్షిత్ రెడ్డి ని (26) పైచదువుల కోసం 3 ఏళ్ల క్రితం అమెరికా పంపించారు. షికాగోలో ఎమ్మెస్ పూర్తి చేసిన అతడు అక్కడే మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో వచ్చే డిసెంబర్ లో కుమారుడికి పెండ్లి చెయ్యాలని ఆ పేరెంట్స్ పనుల్లో మునిగిపోయారు.
ఈతలో అలిసిపోయి
అయితే, తామొకటి తలిస్తే, భగవంతుడు మరొకటి తలుస్తాడు అన్నట్టు.. పోయిన శనివారం అక్షిత్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్ మిషిగన్ చెరువులో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండిపోగా మిగతా ఇద్దరూ నీటిలోకి దిగి చెరువు మధ్యలో ఉన్న ఓ బండరాయి వరకూ వెళ్లారు. చాలా శ్రమకోర్చి అక్కడి వరకూ వెళ్లగా తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతడి స్నేహితుడూ నీట మునిగిపోగా స్థానికులు కాపాడారు. ఈ క్రమంలో పోలీసులు అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం అతడి మృతదేహం హైదరాబాద్ కు చేరుకోగా ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కొడుకు మృతిచెందటంతో ఆ కుటుంబం ఆవేదనకు అంతులేకుండా పోయింది.