Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, December 11: భారతదేశంలో కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది. మరోవైపు కొవిడ్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ప్రకటనలు ప్రజలకు ఈ మహమ్మారి బారి నుండి కొంత ఊరట కలిగిస్తున్నాయి. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే దేశంలో ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 97,96,770కు చేరింది. నిన్న ఒక్కరోజే 414 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,42,186కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,528 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 92,90,834 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 3,63,749 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.84% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 3.71%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక ఇప్పటికీ కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉంది.  అయితే ఆ రాష్ట్రంలోనూ ఆక్టివ్ కేసులు తగ్గుతుండటం ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆక్టివ్ కేసులు 73,001కు చేరగా, కొవిడ్ మరణాలు 47,972కు పెరిగాయి

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య  69.4 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు  15.80 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

శుక్రవారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,496,859గా ఉండగా, మరణాలు 1,580,727కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.