Hyderabad, DEC 31: తెలంగాణలో రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్‌డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను త్వరలో ముగించనుంది. లబ్ధిదారులు కేవైసీని సమర్పించేందుకు జనవరి 31 వరకు తుదిగడువు ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీచేశారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్ కస్టమర్’ (KYC) పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
2014 నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోగా, మరికొందరు పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లించారు. మరికొందరు పెండ్లి తర్వాత కొత్తకాపురాలు పెట్టారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారిపట్టకుండా ప్రభుత్వం కేవైసీ నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. దీంతో గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. దీనికోసం ఆధార్ కార్డు, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.80 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఇందులో 87.81 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 54.17 శాతం వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో కేవైసీకి తుదిగడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.