Kalaburagi Tragedy: బస్సు ప్రమాదంలో ట్యాంకర్ ఎలా పేలిందంటే.., 35 మందిలో 28మంది ఒకే కుటుంబానికి చెందిన వారే, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం
Kalaburagi tragedy (Photo-Video Grab)

Kalaburagi, June 3; క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లాలో గోవా నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదానికి (Kalaburagi Tragedy) గురైంది. ఈ ప్ర‌మాదంలో హైద‌రాబాద్‌కు చెందిన 8 మంది స‌జీవ‌ద‌హ‌నం అయిన సంగతి విదితమే. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR expresses Shock) వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులు మృతి చెందడపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతిచెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఆదేశించారు.ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు, 8 మంది సజీవ దహనం, మరి కొందరికి తీవ్రగాయాలు, ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 35 మంది ప్రయాణికులు

హైద‌రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బ‌ర్త్‌డే వేడుక‌లను గోవాలో జరుపుకునేందుకు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తరువాత హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా, వారు ప్ర‌యాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సు ఆగి ఉన్న డీజిల్ ట్యాంక్‌ లారీని (Karnataka Road Accident) ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు పైనుంచి బోల్తాపడింది. ప్రమాదం తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో మంట‌లు ఎగిసిప‌డి క్ష‌ణాల్లోనే బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. మంట‌లు చెల‌రేగే స‌రికి బ‌స్సులో ఉన్న కొంద‌రు అప్ర‌మ‌త్త‌మై కిటికీల‌ను ప‌గుల‌గొట్టి కింద‌కు దూకారు. 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కలబురిగిలోని మూడు ఆస్పత్రికు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, బాధితులు అంతా బొల్లారంలోని రిసాలాబజార్‌కు చెందినవారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. ఆస్పత్రిలో మరో డ్రైవర్‌ చికిత్స పొందుతున్నాడు. అర్జున్‌కుమార్‌ (37), అతని భార్య (32), బివాన్‌ (4), దీక్షిత్‌ (9), అనితా రాజు (40), శివకుమార్‌ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.