Hyderabad, March 22: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు (Kejriwal Arrest) దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలనే కేంద్ర సర్కారు భావిస్తోందని అన్నారు. ఆ ఏకైక సంకల్పంతోనే పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఝార్ఖండ్ మాజీ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర సర్కారు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటోందని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్… pic.twitter.com/UCVs3DX2Pd
— BRS Party (@BRSparty) March 22, 2024
బీజేపీ సర్కారు చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయని, దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని అన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.
కాగా, కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే లిక్కర్ కేసు, జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అంతకుముందే కవితను కూడా ఈడీ అరెస్టు చేసింది. ఎన్నికల వేళ ఈ అరెస్టులు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.