Hyderabad, OCT 21: తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలుస్తున్నాం అంతేనంటూ ధీమా వ్యక్తం చేశారు. తాము అభ్యర్థుల ఖరారు, ప్రచారంలో అందరికంటే ముందున్నామని చెప్పారు. ఈ సారి బీఆర్ఎస్ గెలిచాక జాబ్ క్యాలెండర్‌ను (Job Calender) ప్రతి ఏడాది విడుదల చేస్తామని కేటీఆర్ అన్నారు. ప్రవళిక మృతి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే.. తాము మానవీయ కోణంలో చూశామని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని చెప్పామని అన్నారు. రేపో, ఎల్లుండో ఇంట్రెస్టింగ్ వార్త వింటారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో కచ్చితంగా ఓడిపోతారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ చెరుకు సుధాకర్
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదే సందర్భంలో నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాల నుండి ప్రముఖ నేతలు, కార్యకర్తలు చేరారు.… pic.twitter.com/4NuViQbqad
— BRS Party (@BRSparty) October 21, 2023
కొన్ని స్థానాల్లో తమ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు సీఎం కేసీఆర్ (KCR) వైపు మాత్రమే చూస్తున్నారని, తాము గెలుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సారి 119 స్థానాల్లోనూ బీజేపీ డిపాజిట్లు కోల్పోతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 35 వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసిందని, ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ అడ్డుపడేదని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో మొత్తం ఐదు మెడికల్ కాలేజీలే నిర్మించారని, తాము 30 నిర్మించామని, వారితో తమకు పోలికా? అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు లేదని, ఫ్లోరోసిస్ పుణ్యం కాంగ్రెస్ దేనని విమర్శించారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పవర్ హాలిడే ఇచ్చిన దుస్థితి కాంగ్రెస్ దేనని అన్నారు. బీఆర్ఎస్ సుద్దులు చెప్పడానికి కాంగ్రెస్ నేతలకు బుద్ధి ఉందా అని నిలదీశారు. కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని, ఆయన ఎక్కడి నుంచైనా పోటీచేస్తారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మాత్రమే సీఎం అని, తనకు అలాంటి పిచ్చి ఆశలు లేవని చెప్పారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏ హోదాలో హామీ ఇస్తున్నారని, ఆ హామీలను ఎలా నమ్మాలని నిలదీశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకోరు.. పెళ్లి చేసుకోరని ఎద్దేవా చేశారు. రాహుల్ పెళ్లి చేసుకున్నా.. చేసుకోకున్న తనకు అవసరం లేదని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వచ్చని చెప్పారు.
ఈసారి బీఆర్ఎస్ 88 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రానికి ఈర్ష్య ఉందని చెప్పారు. ప్రధాని మోదీ మంచి యాక్టర్ అని, పచ్చి అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. ప్రతిపక్షాల పనికిమాలిన మాటలు వినవద్దని కోరారు. ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని, అది సెక్యులర్ పార్టీ అని చెప్పారు. తాము బీజేపీకి బీ టీమ్ కాదని చెప్పారు.రేవంత్ రెడ్డి సీట్లను అమ్ముకుంటున్నది నిజం కాదా అని నిలదీశారు.