Warangal, May 08: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. రైతులపై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్(KTR).. రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో (Kakathiya mega textile park) ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ టెక్స్ టైల్ (Kitex park)పరిశ్రమకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రైతులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. కష్టమైనా, నష్టమైనా ఎదుర్కొని, ఈ ప్రాజెక్టుకు రైతులు భూములిచ్చారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.
వరంగల్ లోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS.
రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనున్నది. pic.twitter.com/kQMicRS81m
— TRS Party (@trspartyonline) May 7, 2022
భూమి ఇవ్వడం చిన్న త్యాగమేమీ కాదన్నారు కేటీఆర్. భూములిచ్చే రైతులకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు కచ్చితంగా ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భూమి లేక తమకు నష్టం జరిగినా, ఇంకెంతో మందికి లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో రైతులు చేసే త్యాగాలు వెలకట్టలేనివని కేటీఆర్ చెప్పారు. అలాంటి అన్నదాతలకు ఎంత చేసినా వారి రుణం తీరనిదని అన్నారు. రూ.1600 కోట్లతో నిర్మించనున్న కిటెక్స్ వస్త్ర పరిశ్రమతో దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో (Warangal) పారిశ్రామికీకరణ వేగంగా జరగాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్లల దుస్తులు తయారు చేసే సంస్థ కిటెక్స్ (Kitex) అని మంత్రి చెప్పారు. ఈ పరిశ్రమ నుంచి ఉత్పత్తి చేసిన దుస్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు.
కిటెక్స్ సంస్థ రూ. 3వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వారిని తెలంగాణకు ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేసి తీసుకొచ్చామన్నారు. మీరు ఇక్కడ పెడితేనే వరంగల్ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి కిటెక్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంస్థ రూ. 1600 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. దీంతో 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు.
కొరియాకు చెందిన యంగ్ వన్ అనే కంపెనీ రూ. 1100 కోట్లతో పెట్టుబడులు పెట్టబోతుందన్నారు. తద్వారా 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ రెండు కంపెనీలు కూడా 8 నుంచి 11 ఫ్యాక్టరీలు పెట్టబోతున్నాయని మంత్రి వివరించారు. రాబోయే 18 నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని , భారతదేశంలో ఇలాంటి టెక్స్ టైల్స్ పార్కు ఎక్కడా లేదని కేటీఆర్ వెల్లడించారు.