Last Day for Khairatabad Ganesh Darshan

Hyd, Sep 15:  వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం జరగనుండగా పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇవాళే చివరి రోజు.

మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం నిలిపివేయనుండగా శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టారు. ఇక చివరిరోజు కావడంతో బడా గణేశ్‌ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధానంగా ఖైరతబాద్ మెట్రో ప్రయాణీకుల రద్దితో కిటకిటలాడుతోంది.

భక్తులు రాకతో ఖైరతాబాద్లో మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐ మాక్స్ వైపు మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్కరి కదలికలను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 17న శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.   గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దు..అందరం కలిసి గణేశ్ నిమజ్జనం విజయవంతం చేద్దామని పిలుపు 

గణపతిని దర్శించుకోవడానికి వచ్చిన వారితో వికృత చేష్టలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. పోకిరీలతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. గణేష్‌ నిమజ్జనానికి 17వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు .