Hyderabad, Jan 9: ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula E Race Case) లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. నందినగర్ ఇంటి నుంచి బయలుదేరిన ఆయన బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి న్యాయవాదితో సహా చేరుకున్నారు. విచారణ నిమిత్తం అధికారులు దాదాపు 40 ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్ములా-ఈ కారు రేసుకి సంబంధించి నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతోపాటూ లాయర్ ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయిన ఆయన.. మరోసారి విచారణకు వస్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
లాయర్ కు అనుమతి
ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్ కు హైకోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను విచారించే ఏసీబీ కార్యాలయంలో దర్యాప్తు గదికి పక్కనే ఉన్న గ్రంథాలయ గదిలో న్యాయవాది ఉండేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ప్రతిపాదనను నిరాకరించింది. గురువారం జరిగే విచారణ తీరును బట్టి అవసరమైతే పిటిషనర్ మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది. ఈ నెల 6 న ఏసీబీ దర్యాప్తుకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్తే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది.